Wednesday, September 8, 2010

జొన్నవాడ తల్లి కి పెన్నమ్మ అభిషేకం

ఇరవై అయిదు రోజుల పాటు ఆఫీసు పని మీద ఆస్ట్రియా వెళ్ళినప్పుడు ఒక కొత్త లోకాన్ని చూశాను అనిపించింది. అక్కడ అభివృద్ది, పచ్చదనం, ప్రజల ప్రవర్తన, సంపద, సంస్కృతి, జాతి వారసత్వాన్ని వారు కాపాడుకునే తీరు, కళలు అన్ని చాలాచాలా గొప్ప గా అనిపించాయి. అయితే వారి కుటుంబ జీవనం, వస్త్ర ధారణ, భోగ లాలస - భారతీయ జీవనానికి కొంత దూరం గా ఉండటం తో సర్దుకుపోవడానికి కొంత కష్ట పడ్డాను. భారతీయులు బంధాలని జీవితం తో పెనవేసుకున్నట్టు గా విదేశీయులు ఉండరేమో అనిపించింది. ఆ కొద్ది కాలం లోనే - వారి లోని మంచి గుణాలని అభినందించగలిగినా అంతకు మించి అసలైన భారతీయ ఆత్మ ని నాలో నేను ఆవిష్కరించుకోవడానికి ఆ విదేశీ ప్రయాణం నాకు సహాయం చేసింది. మన కుటుంబ జీవనం, పాప పుణ్యాలు, దివ్య క్షేత్రాలు, ధార్మిక జీవనం, ఓర్పు - నేర్పు, ఆధ్యాత్మిక చింతన ఎంత అపురూపమైన సంగతులో నాకు బాగా అర్థం అయ్యింది. నేను భారతీయుడి గా జన్మ ఎత్తినందుకు మనసారా గర్వ పడ్డాను.


నన్ను, నా వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకోవడం లో భారతీయ ధర్మం, ఆధ్యాత్మికత నాకు ఎలా దారి చూపిస్తాయో ఆలోచనలో పడ్డాను. అప్పటి వరకు మనసులో సన్నగా మొలకెత్తి ఉన్న కోరిక బలం గా నాటుకు పోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా అక్కడికి దగ్గర లో ఉన్న క్షేత్రాన్ని దర్శించి, ఆ క్షేత్రం యొక్క విశిష్టత ని - తత్వాన్ని తెలుసుకుంటూ నా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కొనసాగించాలి అని నిర్ణయించుకున్నాను. ఈ రోజు మనుషులు పొందుతున్న అనేక రుగ్మతలకి, మానసిక జాడ్యానికి సరి అయిన జవాబు భారతీయ ఆధ్యాత్మికత అని నా ప్రగాఢ విశ్వాసం.

ఆస్ట్రియా నుంచి ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మీదుగా ఇండియా వస్తున్నప్పుడు - విమానం లో చిన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రయాణ మార్గాన్ని నాకు కిటికీ నుంచి కింద కనిపిస్తున్న భూమి తో పోల్చి చూస్తూ ఉన్నాను. పాకిస్తాన్ దాటుతూ ఉండగా చీకటి లో లోయల లాంటి ప్రాంతం కనిపించింది. బాగా నిర్మానుష్యం గా ఉన్న ఆ ప్రదేశం లో ఒక చోట లోయ అంచులలో కొన్ని దీపాలువెలుగుతూ కనిపించాయి. ఆ ప్రదేశం మన పురాణాలలో వివరించిన హింగులా శక్తి క్షేత్రం ఏమో అని అనిపించింది. నిలువెల్లా ఒక పులకరింత కమ్మేసింది. ఎన్నో విశిష్టత లు, విశేషాలు, అందాలు, ఆనందాలు, ప్రకృతి విచిత్రాలు కలగలిసి వెలుగుతున్న ఈ సృష్టిలో - మెదడు తో ఆలోచించ గలిగి మనసు తో అనుభూతి చెందగలిగే మనిషి గా పుట్టి, సకల రోగాలని కల్మషాన్ని రుగ్మత లని పోగొట్టే శక్తి ఉన్న ఆధ్యాత్మిక సంపద పుష్కలం గా ఉన్న భారత దేశం లో నేను ఒక వారసుడి ని అయినందుకు గొప్ప గా అనుభూతి చెందాను - ఆ క్షణం లో.

నాలో ఈ భావ పరంపర ఇలా సాగుతోంది అప్పటి నుంచి - ఒక ప్రవాహం లా.

కొన్ని సంఘటనలు మనం ఊహించనంత వేగం గా జీవితం లో జరుగుతాయి. ఏమి జరుగుతుందో గ్రహించే లోపు మనసు తో చెయ్యకపోయినా బుద్ది తో పని చేస్తాము. ఈ లోపు కొత్తగా జరిగిన సంఘటన ని ఎదుర్కొనే శక్తి ని కూడగట్టుకోవడానికి ప్రయత్నం మొదలు పెడతాము. మా ఇంటిలో ఇద్దరు పెద్ద వాళ్ళు అనుకోని అనారోగ్యం పాలవడం జరిగింది - రెండు సార్లు. ఈ రెండు సార్లు కూడా నా మనసు కి కావాల్సిన శక్తి ని నేను ఈశ్వరుడిని ప్రార్ధించడం వల్లనే పొంద గలిగాను. రెండవ సారి - ఇటీవల ఇలాంటి పరిస్థితి నాకు చాలా ఇష్టమైన నెల్లూరు అత్తయ్య గారి విషయం లో వచ్చింది. ఈ సందర్భం గా నేను చేసిన నెల్లూరు ప్రయాణం జొన్నవాడ యాత్ర రూపం లో నాకు కొత్త శక్తి ని ఇచ్చింది.

సాయంత్రం నాలుగు గంటలకి నెల్లూరు నుంచి ఏడు ఎనిమిది మైళ్ళు ఉన్న జొన్న వాడ కి బయలు దేరాను. విడిగా వినడమే కాని అసలు నెల్లూరు దగ్గర ఊరు ఎలా ఉంటుందో, జొన్నవాడ క్షేత్రం ఎలాంటిదో నాకు ఏమి తెలియదు. ఆటో సాయంకాలపు నీరెండ లో పచ్చటి పొలాల పక్క గా వెళ్తూ ప్రతి నిముషం మనోహరం గా ఉంది. జీవశక్తి ని ప్రతి కణం లోను నింపుకున్న చక్కటి బియ్యం పండే మట్టి అది. ఆ మట్టి ని సస్య శ్యామలం చేసే నీటి ప్రవాహాలు అక్కడక్కడా. క్రమం గా చీకటి కమ్ముకుని వస్తోంది. నీలం గా ఉన్న ఆకాశం ఊదా రంగు పరదాలు వేసుకుంది. ఆకు పచ్చని పంట పొలాలు చిరు చీకట్ల రంగుతో కలిసి కొత్త రంగు లో వెలిగిపోతున్నాయి. కొద్ది సేపటికి దారి రెండు గా చీలిపోయింది. కుడి వైపు ఒక పాయ, ఎడమ వైపు ఒక పాయ. కుడి వైపు పాయ నేరుగా పెన్నా నది ని దాటుకుని సాగుతోంది. ఎడమ వైపు పాయ మలుపు తిరిగి ఇంకొక ఊరికి వెళ్తోంది. కుడి వైపు పెన్నా నది వంతెన దాటిన వెంటనే రోడ్ దిగువన జొన్నవాడ క్షేత్రం.

చాలా ప్రాచీనమైన క్షేత్రం. భగవంతుడు స్వయంభువు గా ఉన్న క్షేత్రం. గుడి లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి అడుగు నాకు అద్భుతం గానే తోచింది. కొన్ని వందల సంవత్సరాల వైభవం ఈ నాటికి కూడా విశ్వాసం ఉన్న వందల మందిని తన వద్దకు తీసుకు వస్తున్నది. ఒక్కొక్క అడుగు కి ఒక్కొక్క పురాణ కథ. మల్లికార్జున స్వామి, కామాక్షి తాయి దర్శనం చాలా సంతృప్తి గా చేసుకున్నాను. కొత్త కొత్త రంగులు అద్ది ఉన్నా అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక వైభవం ఇంకా కనిపిస్తూనే ఉంది. అమ్మవారి ఎదురుగా మంటపం లో కూర్చుని ఉన్నాను. అప్పుడు చూసాను - ఆరోగ్య సమస్యలతో చిక్కి శల్యం అయిన అనేక మంది దీనులని. మతి స్థిమితం లేక ప్రపంచాన్ని పరాయి గా భావిస్తూ బ్రతుకుతున్న అమాయకులని. వారిలో చాలా మంది భయంకరమైన స్థితి లోనే ఉన్నారు. కాని అయిన వాళ్ళు వాళ్ళని గుడి మంటపం లో కూర్చోబెట్టి అమ్మవారి ప్రార్ధన చేయిస్తున్నారు. ఆ అమాయకులకి వారు ఎలాంటి ఆరోగ్య స్థితి లో ఉన్నారో తెలిసే స్పృహ లేకపోవచ్చు. కాని, వారి కళ్ళల్లో అచంచలమైన విశ్వాసం ఉంది. అమ్మవారి మీద, స్వామి వారి మీద అంతులేని ఇష్టం కనిపిస్తోంది. అది అభౌతికమో శాస్త్రీయమో - చాలా మంది విమర్శకులకి తెలియకపోవచ్చు. కాని నమ్మకాన్ని మించిన మందు ఈ భూమి మీద లేదు.

గుడి చుట్టూ ఉన్న ఉప ఆలయాలు అన్ని చూద్దామని చుట్టూ తిరిగాను. గుడి ప్రాంగణం నిండా శారీరక మానసిక స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు రోజుల తరబడి ఉండేందుకు చేసుకున్న ఏర్పాట్లు. గుడి వెనక భాగం లో సాయంకాలపు సేవ లు జరుగుతున్నాయి. అక్కడ కూడా సామాన్య జనులతో పాటు ఆరోగ్యం సరిగా లేని చాలా మంది కూర్చుని ఉన్నారు. వైద్యం చేయించలేని వాళ్ళు, వైద్యానికి కూడా లొంగని జబ్బులని విశ్వాసం తో తగ్గించుకోవాలని వచ్చిన వాళ్ళు అనేకం గా ఉన్నారు - ఇంతకు మించిన మానవత్వాన్ని మనం ఎక్కడ చూడగలం ? ఇంతకు మించిన దీన జనోద్దారణ మరి ఎక్కడ గమనించగలం ? జొన్నవాడ క్షేత్రం మీద నాకు ఉన్న ఇష్టం ఆకాశాన్ని తాకింది. ఆ క్షేత్రం గురించి విన్నాను - "అక్కడ ఒక సమస్య తో వచ్చిన వాళ్ళు గుడి ప్రాంగణం లో నిద్ర చేస్తూ రోజులు గడుపుతూ ఉండగా, క్రమం గా పూర్ణ ఆరోగ్య వంతులు అవుతారు" అని. విశ్వాసం బలం గా ఉన్న వారికి అమ్మవారు కలలో కనిపించి "ఇక ఇంటికి వెళ్లి హాయిగా ఉండు" అని పంపిస్తారని. నాస్తికులు దీనిని అద్భుత రసం అని కొట్టివేయచ్చు. కాని, కంటి ముందు కనిపించే పరమ సత్యాలని ఎవరుకూడా విస్మరించలేరు.

మనసు నిండిన ఆనందం తో గుడి బయటకు వచ్చాను. ఆ రాత్రి సమయం లో ఆటో దొరకాలి అంటే పది నిముషాలు పెన్నా నది వంతెన దాటి నడవాల్సి వస్తుంది అన్నారు. అదే సమయం లో అక్కడ పని కోసం వచ్చిన ఒక కార్మికుడు నాతో పాటు నడుస్తూ నన్ను పలకరిస్తూ వంతెన దాటుతూ ఉన్నాడు. ఒక్క క్షణం ఆగి వంతెన మీద నుంచి పెన్నా నదిని, జొన్నవాడ గుడి ని చూశాను. ఆ పెన్నా నది నీళ్ళ లోనే మొదట అమ్మవారి విగ్రహం దొరికిందిట. అమ్మవారి గుడి దగ్గర పచ్చని దీపాల వెలుగులు - పున్నమి చంద్రుడి కాంతి లో నీలం గా మెరుస్తున్న పెన్నా నీటిలో ప్రతిఫలిస్తున్నాయి. అక్కడికి రహదారి రెండు గా చీలిన చోటు ఒక రెండు వందల మీటర్ల దూరం లో ఉంది. మేము ఆ జంక్షన్ వైపు నడుస్తున్నాం. కుడి వైపు మలుపు లో మేమున్నాం. ఎడమవైపు మలుపు లో ఒక కిలో మీటరు దూరం లో ఇంకొక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద పెద్ద గుడి తెల్లని దీపపు కాంతులలో వెలిగిపోతోంది. అది వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి గుడి అని చెప్పారు. తల్ప గిరి రంగ నాథ స్వామి (నెల్లూరు ఊరిలో పెన్నా ఒడ్డున ఉంది), రజత గిరి మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారు (జొన్నవాడ), వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి - మూడు చోట్ల స్వయం గా వ్యక్తం అయిన పుణ్య భూమి నెల్లూరు అని నాకు అర్థం అయ్యింది. ఈ ప్రదేశాలను తాకుతూ పచ్చని పొలాలని తడుపుతూ అక్కడి ప్రజలకి జీవాన్ని, జీవితాన్ని ఇస్తున్న సుర గంగ పెన్నమ్మ అని నాకు అనిపించింది. రజత గిరి, వేదగిరి దారులు కలిసిన ప్రదేశానికి వస్తు ఒక్క సారి వెనక్కి తిరిగి చూసాను.

ఎదురుగా సుసంపన్నమైన పొలాలు. కుడి వైపు చీలిన దారిలో పెన్నా నది, నది మీద వంతెన, నది ఒడ్డున దిగువ లో కామాక్షి అమ్మవారి గుడి. ఎడమ వైపు చీలిన దారిలో కొండ మీద వేదగిరి స్వామి వారి గుడి. ఇటు అమ్మ వారి గుడి బంగారు వెలుగులు పెన్నా లో తళుకులు అవుతున్నాయి. అటు వేదగిరి మీద నరసింహ స్వామి గుడి వెండి వెలుగులు ఆకాశాన్ని ధగ ధగ లతో నింపుతున్నాయి.

జొన్నవాడ అమ్మవారి విగ్రహం నా రెండు సంవత్సరాల కూతురు కూర్చుని ఉన్నప్పుడు ఎంత ఉంటుందో అలాగే ఉన్నట్టు అనిపించింది - అర గంట కింద చూసినప్పుడు. కాని ఇప్పుడు నా కంటికి ఆ గుడి మొత్తం అమ్మవారి లా కనిపిస్తోంది, ఆ పసుపు దీపాల వెలుగులు అమ్మవారి కుంకుమ, ఆభరణాల కాంతి లా అనిపిస్తోంది. పెన్నమ్మ అమ్మవారిని అభిషేకిస్తూ వెళ్తున్నట్టు గా ఉంది. పెన్నమ్మ లో మెరుస్తున్న అమ్మవారి గుడి దీపాల వెలుగులు, అభిషేకం చేస్తున్న నీటి మధ్యలో నుంచి మెరుస్తున్న అమ్మవారి గాజుల్లా ఉన్నాయి.

శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలువారిన భాగ్య సీమయి

సాగినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !

Monday, October 26, 2009

కళ్యాణం కమనీయం

కొమ్మూరు - మా నాన్న గారి బాల్యానికి వేదిక.
కొమ్మూరు - మా దసరా సంక్రాంతి వేసవి సెలవుల నెలవు.
కొమ్మూరు - మా కోతి కొమ్మచ్చి, దాగుడు మూతల ఆటలను భద్రం గా జ్ఞాపకాల పెట్టెల్లో దాచిపెట్టిన బంగారు గని.

మాది గుంటూరు జిల్లా లోని పెదనందిపాడు పక్కన చిన్న కుగ్రామం. అదే మా చిన్నప్పటి కలల ప్రపంచం. స్కూల్ కి సెలవులు ఇవ్వగానే మనసు మా తాత గారి ఊరికి పరుగులు తీసేది. అక్కడ తాతయ్య అగస్త్యేశ్వరస్వామి వారి గుడిలో అర్చకులు గా ఉండేవారు. అలా అనడం కన్నా ఆ స్వామి వారు మా తాతయ్య గారిని, ఆయన కుటుంబాన్ని తర తరాలుగా కనిపెట్టుకుంటూ ఉన్నారు - అని చెప్తే సరిగ్గా సరిపోతుంది.

ఆవుల మెడలో గంటల చప్పుడు, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గుర్రపు మేనాల సందడి, పశువుల కొట్టాల్లో గడ్డి వాముల చిరు చిరు శబ్దాలు, ఊరికి ఒక వైపు ఉన్న పెద్ద చెరువు నుంచి వాడుక నీళ్లు మోసుకు వెళ్తున్న జనాల పలకరింపులు, ఊరికి మరొక వైపు ఉన్న చిన్న చెరువు నుంచి కావళ్ళతో మంచి నీళ్లు మోసుకు వెళ్తున్న జనాల హడావిడి, గాలికి కొద్ది కొద్ది గా పైకి లేచే నల్ల రేగడి దుమ్ము, అక్కడక్కడ దారికి పక్కన స్నేహం గా తలలు ఊపే తుమ్మ చెట్లు, గుంటూరు ఎండలని తన గుండెల్లో దాచి తన ఒడి చేరిన వాళ్ళకి చల్ల దనాన్ని పంచె చింత చెట్లు, అన్నిటికీ మకుటాయమానం గా - తర తరాల రాజుల చరిత్ర ని, విధ విధాల ఆధ్యాత్మిక సౌరభాలని తన నిండా నింపుకుని ఊరికంతటికీ పెన్నిధి లా ఠీవి గా, శోభ గా, దయ గా, ప్రేమ గా - అగస్త్యేశ్వర స్వామి దేవాలయ సముదాయం ఎత్తైన రాజ గోపురం తో, బ్రహ్మాండమైన ధ్వజ స్తంభాలతో కొలువై ఉంటుంది.

మా తాతయ్య గారు మల్లయ్య శాస్త్రి గారు - స్వామి వారి సన్నిధి లో తన జీవితాన్ని పండించుకుని ఆ వెలుగులని తర తరాలకు అందించిన పుణ్య మూర్తి. హిందువులు, ముస్లిములు కలిసి కట్టుగా ముందుకు సాగే ఆ ఊరిలో తాత గారు చెప్పిన ముహుర్తాలకే తమ ఇంటి శుభ కార్యాలు జరిపించుకోవాలని అందరూ కోరుకునే వారు. ఎవరు ఇంటికి ఆకలితో వచ్చినా - కులం మతం తేడా లేకుండా - ఇంటికి వచ్చిన అందరి కడుపు నింపిన మాతృమూర్తి మా నాయనమ్మ కృష్ణవేణమ్మ గారు. నా ఊహ వచ్చేటప్పటికి మా నాయనమ్మ గారిని నేను చూడలేకపోయినా జీవితం లోని చాలా సందర్భాలలో ఆమె దీవెనలని నేను అవ్యక్తమైన రూపం లో అందుకుంటూనే ఉన్నాను.

కొద్ది కొద్ది గా ఊహ వస్తున్నప్పటి నుంచి - సెలవులకి కొమ్మూరు వెళ్ళడం, బాబాయ్ వాళ్ల పిల్లలతో ఆడుకోవడం, తాతయ్య చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్పడం, రాత్రి పొద్దు పోయేదాకా గుడి లో కాలక్షేపం చెయ్యడం, గుడి లో ప్రతి చెట్టుని పుట్టని పలకరించడం , రాత్రి ఎక్కువ గా కరెంటు పోయినప్పుడల్లా తాతయ్య మంచం మీద పక్కన కూర్చుని సైన్సు విశేషాలని కొంచెం కొంచెం నాకు తెలిసిన వాటిని ఆయనకీ చెప్పడం - ఒక ప్రవాహం లా సాగిపోయింది ఆ చిన్నతనం.

తాతయ్య గుడి నుంచి వచ్చిన తర్వాత తన విస్తరి తానే స్వయం గా కుట్టుకుని భోజనం చేసేవారు. వంట గదిలోనే ఒక వైపు దేవుడి పటాలు ఉంచిన ప్రదేశానికి దగ్గరలో తాతయ్య భోజనానికి కూర్చునే వారు. అక్కడ ధ్యాన ముద్ర లో ఉన్న ఆంజనేయ స్వామి పటాన్ని, తాతయ్య ని కలిపి ఒకే దృశ్యం గా పేర్చి నా మెదడు చిన్నప్పుడే నిక్షిప్తం చేసుకుంది.

కొమ్మూరు గుడి లోని ప్రతి అంగుళం నా చిన్నప్పటి ఆటల ప్రపంచం లో అంతర్భాగం. అయ్యవారి అంతరాలయం ఎదురు గా ఉన్న గుడి అంతర మంటపం లో ఉంచిన ఉత్సవ వాహనాలను ఎక్కి సవారి ఆట ఆడేవాళ్ళం. స్వామి వారి ఆలయం బయట మంటపం లో ఉన్న నంది విగ్రహాన్ని కూడా మా ఆటల్లో భాగం చేసుకున్నాం. పాడుబడ్డ వీరభద్ర స్వామి మంటపం లోకి వెళ్లి రావడం అంటే అదో గొప్ప సాహసం. ధ్వజ స్థంబాల మొదలు దగ్గర నాలుగు స్థంబాల ఆట ఆడేవాళ్ళం. స్వామి వారి ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగ ద్వారాలు లేని వినాయకుడి గుడి ఒకటి ఉంది. ఆ వినాయకుడు హాయిగా నింపాదిగా కూర్చొని మా ఆటల్ని చూస్తూ ఉన్నట్టు ఉండేవాడు. అప్పుడప్పుడు దాగుడు మూతల ఆటలో భాగం గా ఆయన వెనక్కి వెళ్లి దాక్కునే వాళ్ళం. అదే మా ప్రపంచం. అక్కడ ఉన్న చిన్న దేవుళ్ళందరూ మా ఆటల జట్టు లో భాగం. పెద్ద గా లోతు లేని కోనేరు లో దిగి కాళ్ళు తడుపుకోవడం, ఒక్కొక్క సారి కోనేరు స్నానం చెయ్యడం (పెద్ద వాళ్ళకి తెలియకుండా) - ఇవి మా ఆట విడుపు పనులు.

కోనేటి ఒడ్డు నిండా చింత చిగురు పువ్వులు. గుడి ప్రాంగణం చుట్టూ పచ్చ గన్నేరు పూలు - స్వామి వారికీ చాలా చాలా ప్రియమైన పూలు అవ్వి. గుడి ప్రాంగణం అంతా గాలి మోసుకొచ్చిన పచ్చ గన్నేరు పరిమళం . శివుడి గుడి కి ఒక వైపు మూలగా విష్ణు ఆలయాలు కొంచెం చిన్నవి మూడు ఉన్నాయి. ఆ మూడు ఆలయాలని కలుపుతూ ఒక పెద్ద సిమెంట్ అరుగు. ఆది ఆది అలసిన తర్వాత విశ్రాంతి కోసం ఆ అరుగుల మీద కూర్చునే వాళ్ళం. దాదాపు పది ఎకరాలలో విస్తరించి ఉన్న ఆ గుడి అంతా సెలవులలో మా అల్లరితో, మా ఆటలతో సందడి నింపుకునేది.

తాతయ్య దేవుడి లో ఐక్యం అయిన తర్వాత కొమ్మూరు కి మా రాకపోకలు బాగా తగ్గాయి. ఆ జ్ఞాపకాలు అన్ని ఎక్కడో మనసు లోపలి అరల్లో దాక్కుని వాటి కి అవే తాళం వేసేసుకున్నాయి.

కాలం చాలా చాల వేగం గా తిరిగింది. నేను చదవ దలుచుకున్న చదువులు పూర్తి అయ్యాయి. ఉద్యోగం వచ్చింది. జీవితం లో ఒక ముఖ్యమైన ఘట్టం వచ్చింది - నా పెళ్లి. చీరాల సంబంధాన్ని ఖాయం చేసుకున్నాం. విజయవాడ నుంచి పెళ్లి బస్ ఎక్కబోయే ముందు నాయనమ్మ, తాతయ్య ల ఫోటో ముందు నమస్కారం చేస్తూ నిల్చున్నాను, వాళ్ల ఆశీర్వాదం కోసం. మనసు లో ఒక చిన్న కదలిక - జీవితం లో ఒక ముఖ్యమైన ఘట్టం జరగబోతోంది, అత్యంత కమనీయమైన కావ్యం గా నిలిచిపోవాల్సిన సందర్భం అది. మూలాలు సరిగ్గా ఉన్న చెట్టు దిన దిన ప్రవర్ధమానమై మంచి ఫలాలని ఇస్తుంది. విద్య ని, వృద్ది ని, సంస్కారాన్ని, ఆప్యాయతల్ని, విలువలని మాకు మూలాలుగా మిగిల్చి - మా అభివృద్ది కి దారులు పేర్చిన తాతయ్య నాయనమ్మల అడుగు జాడల్లో మా దంపతుల జీవితం కుడా వెలుగులు నింపుకోవాలని కోరుకున్నాను.

జూన్ ఎనిమిది న పెళ్లి అయ్యింది - చాలా వైభవం గా.

పెళ్లి చాలా బాగా జరిగింది, కాని ఎక్కడో చిన్న వెలితి. మనసు లో ఏదో ఒక మూల ఏదో చిన్న ఖాళి ఉంది. ఎన్నో ఏళ్ళుగా చోటుచేసుకున్న ఆ వెలితి నేను ఇప్పుడు ఉన్నాను అంటూ పదేపదే పైకి వస్తోంది. వేగం గా చాలా ఏళ్ళు గా పరుగులు తీస్తున్న మనసు ఆ రోజు బాగా మొరాయిస్తోంది.

పెళ్లి తర్వాత నేను, నా భార్య, ఏడు నెలల క్రితమే ప్రసవం అయ్యి పసి బిడ్డతో ఇండియా వచ్చిన అక్క, చేతిలో నెలల పిల్ల - నలుగురం కలిసి కార్ లో చీరాల నుంచి విజయనగరం బయలుదేరాము. నాకు అంతకు ముందు చీరాల నుంచి దగ్గర దూరాలు తెలియవు. డ్రైవర్ చీరాల నుంచి విజయవాడ వెళ్లడానికి దగ్గర రూట్ కోసమని మెయిన్ రూట్ నుంచి పక్కకి తీసుకున్నాడు. పర్చూరు వచ్చింది. నాకు చిన్న అనుమానం - చిన్నప్పుడు తాతయ్య వాళ్ల ఊరు వెళ్ళాలంటే గుంటూరు లో పర్చూరు బస్ ఎక్కునట్టు గుర్తు. అక్కడికి నందిపాడు దగ్గరేనా అని అడిగాను. మనం ఇప్పుడు అటు నుంచే వెళ్తున్నామని చెప్పాడు - షార్ట్ కట్ అని. ఒక్క సారిగా ఉత్సాహం ఎగదన్నుకుని వచ్చింది. అక్కడ నుంచి మమ్మల్ని కొమ్మూరు తీసుకెళ్ళమని అడిగాను. ఒక గంట లో వచ్చేద్దాము అని అడిగాను. అతను సరే అన్నాడు.

నందిపాడు నుంచి కొమ్మూరు రూట్ లోకి వచ్చిన దగ్గర నుంచి మనసు ఉరకలు వేసింది. బస్ దొరకని రోజుల్లో నందిపాడు నుంచి కొమ్మూరు నడుస్తూ దారిలో చేసిన అల్లరి, ఆడిన ఆటలు అన్ని గుర్తుకు వచ్చాయి. అక్కడ రోడ్ ఎక్కడ ఎత్తు అవుతుంది, ఎక్కడ కిందకి దిగుతుందో కుడా నాకు గుర్తు ఉంది. చిన్నప్పటి చిన్న చిన్న కాళ్ళతో నడిచిన దాని కన్నా కార్ లో ఆ దూరం చాలా చాలా తక్కువ అనిపించింది. నా చిన్న కళ్ళకి అప్పుడు కొమ్మూరు చాల పెద్ద ఊరు. కాని ఇప్పుడు అది చాలా చిన్న గా ఉన్న బొమ్మల కొలువు లాగ అనిపించింది. కొమ్మూరు మెయిన్ రోడ్ మీద పది పైసల తో గొట్టాలు, బిళ్ళలు కొనుక్కున్న షాప్స్ ని చూస్తూ చూస్తూ తాతయ్య ఇంటికి దగ్గర గా వస్తున్నాం. ప్రతి వీదిలోను, ప్రతి ఇంటికి ఒక జ్ఞాపకం. ఒక ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉండేవి. ఆ ఇంటిలో పులి ఉంది, అందుకే తలుపులు వేసి ఉంచారు అని నమ్మేవాళ్ళం. ఆ ఇల్లు దాటాల్సి వస్తే ఒక్క పరుగు లో దాటేసే వాళ్ళం. ఆ క్షణం నాలో కలిగే ఆనందాన్ని అనుభూతులని నా కొత్త భార్య ఆశ్చర్యం గా గమనిస్తోంది. అక్క, నేను ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క జ్ఞాపకం చెప్తూ ఉంటే తనకి మాట్లాడటానికి కూడా అవకాశం చిక్కలేదు.

తాతయ్య ఇల్లు చేరాము. గేటు నుంచి బావిని, కొబ్బరి చెట్లని, సరుగుడు చెట్లని, ప్రతి గోడ ని, ప్రతి బండ ని ఆనందాతిరేకం తో పలకరించాను. బాబాయ్, పిన్ని, అక్క (బాబాయ్ కూతురు) ప్రేమ గా ఆహ్వానించారు. వెంటనే గుడి కి వెళ్ళాము. ఆ ఊరు కొంత మారింది, తాతయ్య గారి ఇల్లు కొంత మారింది, గుడి కూడా చాలా మారింది. కాని నా అందమైన జ్ఞాపకాలు ఇంకా అక్కడ ప్రతి అణువణువునా భద్రం గా ఉన్నాయి.

ఆ గుడి ప్రాంగణం లో మధ్య లో ఉన్న కట్టడం మాత్రమె గుడి కాదు. అక్కడ అణువణువు నాకు గుడి లాంటిదే. నవ దంపతులం, అక్క, పసి పిల్ల అందరం స్వామి వారి ముందు, అమ్మ వారి ముందు. మా తాత గారు నా కళ్ళ ముందు అభిషేకం చేస్తున్నట్టు తోచింది ఒక్క క్షణం. నిలువెత్తు స్వయంభూ లింగం. తాత గారి గొంతు తో మంత్రాలు ఆ గాలిలో ప్రతిధ్వనిస్తున్నాయి. తాతయ్య, నాయనమ్మ అక్కడ అగస్త్యేశ్వర స్వామి, పార్వతి అమ్మవారి రూపం లో మమ్మల్ని చూస్తున్న భావన నాకు కలిగింది.

పసి వయసులో ఆటలు తప్ప వేరే ప్రపంచం తెలియని రోజుల్లో తాతయ్య , బాబాయ్ పూజ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రతి అంగుళం చిన్న చిన్న కాళ్ళతో తిరిగిన గుర్తు. శివ లింగం విభూతి , కుంకుమ రేఖలతో అందం గా కనిపిస్తూ ఉండగా గర్భాలయం తలుపుల వద్ద రంగు రంగుల కరెంటు దీపాలు కూడా వెలుగుతూ ఉండేవి. పచ్చని పసిమి రంగులో ఉండే అమ్మవారు రంగు దీపాల కాంతి లో సప్త వర్ణాల లో శోభిస్తూ ఉండేవారు. అంతటా పచ్చ గన్నేరు సువాసనలు విభూతి సుగంధాలతో కలిసి మనోహరమైన సుగంధం ఏదో వస్తూ ఉండేది.

అప్పుడే జీవన యాత్ర మొదలు పెట్టబోతున్న కొత్త దంపతులం ఒక వైపు, అమెరికా నుంచి పసి బిడ్డని మురిపెం గా తీసుకుని వచ్చిన అక్క ఇంకొక వైపు - అనుకోని ఈ అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాం. బాబాయ్ పూజ చేశారు. కొద్ది సేపు అక్కడి దేవుళ్ళు అందరినీ తనివి తీరా పలకరించాము. ఇప్పుడు అక్కడ ఎక్కువ గా పచ్చ గన్నేరు పూలు లేవు. కాని నాకు ఇంకా ఆ గన్నేరు పూల వాసన అక్కడ ప్రతి చోట గుప్పుమంటోంది.

ఆలస్యం అవకుండా ఇల్లు చేరాలని వెనక్కి బయలుదేరాము. పిన్ని ఎప్పుడూ పిండి వంటలు చేసి ఉంచుతుంది. మాకు సర్ది పంపడానికి సిద్ధం గా ఉంచింది. అప్పటికి మూడు నాలుగు రోజుల కిందట స్వామి వారి కళ్యాణం జరిగింది. కళ్యాణం లో స్వామి వారికీ, అమ్మవారికి పెట్టిన బట్టల్ని నాకు, నా భార్య కు పెట్టింది. ఇంత కన్నాగొప్ప పెళ్లి కానుక ని నేను ఊహించలేను. అక్క కూడా అమ్మవారి ప్రసాదాన్ని అందుకుంది.

ఈ రోజు నాకు నిజమైన పర్వదినం. ఏ స్వామి అయితే ఈ మూల స్థానం నుంచి ప్రపంచం లో మేము ఎక్కడ ఉన్నా మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడో ఆ స్వామి దర్శనం తో నా వివాహ వేడుకలకి సంపూర్ణత్వం వచ్చింది. ఆ మూలాలని ఈ రోజు నేను స్మరించుకోగాలిగాను. మూలాలని మరిచిపోయిన మనిషికి మనుగడ లేదు - అని నేను నమ్ముతాను.

ఇంక అక్కడి నుంచి మా ప్రయాణం మొదలయ్యింది ... కొన్ని రోజులు గా నన్ను వేధించిన వెలితి ఇంక నాలో లేదు. ఈ అనుభూతుల పరంపర లో అది ఎప్పుడో జారుకుంది. ఆ మట్టి సువాసనల వెల్లువ నాకు సంపూర్ణం అయిన ఆనందాన్ని ప్రసాదించింది.

నిజం , నా కొమ్మూరు స్వామి అమ్మవార్ల కళ్యాణ వస్త్రాల ని అందుకున్న ఆ క్షణాల్లోనే మా దంపతులపై స్వచ్చమైన ముత్యాల తలంబ్రాలు పోసుకున్నంత ఆనందం కలిగింది. అప్పుడు నేను అనుకున్నాను - ఈ కళ్యాణం కమనీయం అని.

Thursday, February 5, 2009

వెండి పూల వాన

నెల్లిమర్ల - ఒక ప్రశాంత భావుకుడి కలలలోకం.
నెల్లిమర్ల - ఒక ఆనంద స్వాప్నికుడి వర్ణ చిత్రం.

ఖమ్మం జిల్లా లో కేరింతల మయం గా సాగిన నా బాల్యం నుంచి నేను వ్యక్తి గా రూపు దిద్దుకున్న వయసుకి నెల్లిమర్ల చేరాను. విజయనగరం నుంచి రద్దీ గా ఉండే పాలకొండ రోడ్ లో పది కిలోమీటర్ల దూరం లో ఉన్నఅందమైన బొమ్మరిల్లు లాంటి ఊరు ఇది. విజయనగరం నుంచి ఈ ఊరికి వెళ్ళే దారి కూడా పచ్చగా పొలాలతో, తోట లతో, పిల్ల కాలువలతో, పెద్ద పెద్ద కొండలతో అందంగా భూదేవి కి ఎర్ర అంచు (అవును, అక్కడ అంతా చక్కటి ఎర్ర మట్టి ) ఉన్న పచ్చటి చీర కట్టినట్టు గా ఉంటుంది. గంభీరం గా చుట్టూ నిలబడ్డ పర్వతాల మధ్య నెల్లిమర్ల - అమ్మ నాన్న చాటు పెరిగిన అమ్మాయిలా పొందిక గ ఉంటుంది. ఊరు మొత్తం ఒక వైపు పెద్ద కొండలు ఇంకొక వైపు రైలు పట్టాల మధ్య విస్తరించి ఉంటుంది. ఊరి మధ్యలో ఒకే ఒక మెయిన్ రోడ్. దాని చుట్టూ ఊరు కాలనీ ల్లాగా విడిపోయి కలిసి ఉంటుంది.

నెల్లిమర్ల ని ఆనుకుని ప్రవహిస్తుంది చంపావతి నది. ఆ నది లో నీళ్లు ఉద్ధృతం గా ఉండేది ఏడాది మొత్తం లో కొన్ని వారాలు మాత్రమే. కాని ఆ నది అంతర్వాహిని గా చుట్టూ పక్కల చాలా గ్రామాల బావులకి నీరు ఇస్తుంది. నెల్లిమర్ల ఊరికి చంపావతి నదికి మధ్య ఒక పెద్ద పచ్చిక బయలు ఉంది. ఊరిలో పెద్ద సభలు, ఆటలు నిర్వహించాలంటే చంపావతి తల్లి పాదాలని తాకుతున్న ఆ ఒడ్డుకి చేరాల్సిందే. నెల్లిమర్ల నుంచి పాలకొండ వెళ్ళే బస్ రూట్, కలకత్తా వెళ్ళే ట్రైన్ రూట్ అన్ని చంపావతి నది ని పలకరిస్తూ వెళ్ళాల్సిందే.

ఆ రోడ్ వంతెన దగ్గర నుంచుని, వచ్చే పోయే వాహనాలని పలకరిస్తూ కొంచెం పక్కన దిగువ లో ఉన్న పచ్చిక బయలులో కొద్ది సేపు తిరిగి ఇంటికి చేరడం నాకు ఉన్న వ్యాపకాలలో చాల ముఖ్యమైనది. రాత్రి అయితే ఆ పచ్చిక దగ్గర పెద్ద కాంతి ఏమి ఉండదు. కాని రోడ్ పక్కన ఉండే దీపాల కాంతి ఆ పచ్చిక బయలు మీద పది ఆ ప్రదేశం అంతా కెంపు ల్లాగా మెరుస్తూ ఉండేది. చంపావతి నదిలో నీరు లేని రోజుల్లో ఆ ఇసుక తిన్నెల మీద నా ఫ్రెండ్స్ తో కలిసి ఎన్ని ఆటలు ఆడామో, ఎన్ని మాటలు చెప్పుకున్నామో లెక్కకు దొరకవు.

వెన్నెల రాత్రి లో చంపావతి ఇసుక తిన్నెల మీద ఆరబోసిన వెండి పూలని తన్మయత్వం తో చూస్తూ వంతెన మీద అలా ఆగిపోయిన క్షణాల్లో వెన్నెల వర్షం లో అప్పటికే తడిసిన కొండలన్నీ నా మీదకి లేత చలి గాలులని పంపేవి.

ఆ రోజుల్లో ఒక నాడు పేపర్ లో ఒక వార్త వచ్చింది - 'ఒక అంతరిక్ష అద్భుతం ప్రపంచం అంతా ఆవిష్కృతం అవుతుంది అని'. ఒక తోక చుక్క దాని శకలాలని విడుస్తోంది అని, ఆ దృశ్యం ఆకాశం లో గొప్ప అందాన్ని ఆవిష్కరిస్తోంది అని. అంటే స్వర్గం లో దేవతలు అంతా కలిసి దీపావళి చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఆ వార్త వచ్చిన దగ్గర నుంచి నేను, నా ఫ్రెండ్స్ ఆ రోజు కోసం ఎదురు చూసాం. ఆకాశం ఆ రోజు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని కలలు కన్నాం. సరిగ్గా ఆ రాత్రి గడిచి తెల్ల వారిన వెంటనే నాకు బీ. సి. ఏ. కోన్సేల్లింగ్ ఉంది. అది నా కెరీర్ కి చాల చాల ముఖ్యం. అయినా ఆ అంతరిక్ష అద్భుతం ముందు నాకు ఏవి పెద్ద గా అనిపించలేదు.

నలుగురు ఫ్రెండ్స్ అందరం గోనె పట్టాలు తీసుకుని సైకిళ్ళ మీద మా చంపావతి ఒడ్డున ఉన్న పచ్చిక బయలుకి వెళ్ళాము. గోనె పట్టాలు పరిచి అందరి తలలు దగ్గరగా ఉండేలా నలుగురం నాలుగు దిక్కుల వైపు కి పడుకుని ఆకాశాన్ని చూస్తున్నాం. ఏ దిక్కులో ఆ అద్భుతాలు మొదలు అయినా నలుగురికీ తెలుస్తుంది అని అలా పడుకున్నాం. ఆకాశం వంక చూస్తూనే చదువులు, ఉద్యోగాలు అన్నిటి గురించి చాలా చాలా మాట్లాడుకున్నాం. కొద్ది సేపు ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసిన అద్భుతమైన విషయాలు చెప్పాము. అర్ధ రాత్రి నుంచి ఒక్కొక్క సారి ఆకాశం నుంచి కొన్ని చుక్కలు రాలినట్టు కనిపించడం మొదలయ్యింది. మేము విష్ణు చక్రం వెలుగుల లాంటి అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. గంటలు గడుస్తున్నాయి. అప్పుడు ఒకటి ఇప్పుడొకటి చుక్కలు వెలుగులు విరజిమ్మి మాయం అవుతున్నాయి. కాని పూర్తి అద్భుతం చూడలేదు. పొగ మంచు సన్నగా మా మీద రాలుతోంది. అంతా తడిసి పోయాము. కాని ఫ్రెండ్స్ అందరం రాత్రి అంతా మేలుకుని ఆ పచ్చిక లో పడుకుని మాట్లాడుతూ నక్షత్రపు పూలని విచ్చిన కన్నులతో చూడటం ఎంత గొప్ప అనుభూతి ? తెల్ల వారు ఝామున నాలుగు గంటలకి ఇంటికి బయలుదేరాము.

ఆ రోజు మేము అక్కడ ఆశించిన స్థాయి లో అంతరిక్ష అద్భుతాన్ని చూసి ఉండక పోవచ్చు. కాని ఈ రోజు హైదరాబాద్ నీరెండల్లో లాప్-టాప్ పట్టుకుని నడుస్తున్న ఈ క్షణాల్లో కూడా ఎప్పుడన్నా దాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నిజం గానే ఆ రోజు కురవని వెండి పూల వాన ఈ రోజు కురిసినట్టు గా , మనసు నిండా.

మనసున మల్లెల మాలలూగెనే ... కన్నుల వెన్నెల జోల పాడేనే.

Tuesday, January 13, 2009

ఆవిష్కారం

మీ మనస్సులో ఉన్న జ్ఞాపకాలకి వెలుగు చూపించండి. మీరు మరిచిపోలేని సంఘటనలని, సంగతులని, చిన్న నాటి అనుభూతులని అందరితో పంచుకోండి. మీ ఆనందపు తీపి గుర్తులుగా మీ ఊరిలో మీరు దిగిన ఫోటో లని కూడా మాతో పంచుకోండి. బిజీ లైఫ్ లో, ఆఫీసు పాలిటిక్స్ లో మునిగిపోయి - మీ లోలోపలికి నిద్ర పుచ్చిన నిజమైన మిమ్మల్ని మీరు ఇక్కడ పరిచయం చేసుకోండి.

గుర్తుకు వస్తున్నాయి

ఫ్రెండ్స్,

మనం మన కెరీర్ కోసం ఉద్యోగాల కోసం నగరాల్లో ఉంటున్నాం. కాని సంక్రాంతి వచ్చినప్పుడు, పున్నమి నాడు వెన్నెల పిలిచినప్పుడు మన ఊరు మనకి గుర్తు వస్తుంది. నగరం మనకి జీవితాన్ని ఇస్తుంది. మన ఊరు మనకి అనుభూతులని, వ్యక్తిత్వాన్ని, ప్రేమని పంచుతుంది. అందుకే మన ఊరితో మనకి ఉన్న అనుభూతులని ఆవిష్కరించాలనే ఈ వేదిక ని ఎంచుకున్నాను. రండి, మనసులో పరుగులు తీస్తున్న ఆనందాన్ని మాతో పంచుకోండి.